Chhotu 5kg LPG Cylinder: ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ అయిపోతే ఎంత ఇబ్బంది అని అందరికీ తెలుసు. ఏజెన్సీకి ఫోన్ చేసి బుకింగ్ పెట్టి, డెలివరీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కానీ ఇక ఆ సమస్యకు పరిష్కారం వచ్చేసింది. ఇండియన్ ఆయిల్ తీసుకొచ్చిన ఛోటు 5 కేజీల సిలిండర్తో గ్యాస్ కావాలనిపించిన వెంటనే మీ చేతికి చేరుతుంది.

ఈ ఛోటు సిలిండర్ సాధారణ 14.2 కేజీల సిలిండర్ కంటే చాలా చిన్నది. ముందు బుకింగ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు నేరుగా దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు. పరిమాణం తక్కువ ఉండటం వల్ల ఎక్కడైనా సులభంగా మోసుకెళ్లవచ్చు. నగరాల్లో ఒంటరిగా ఉండే వారికి, చిన్న కుటుంబాలకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది.
కొనుగోలు చాలా సులభం. ఐడి ప్రూఫ్ మాత్రమే చూపిస్తే సరిపోతుంది. అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. ఇది ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) కేటగిరీలో ఉండటం వల్ల ఏ ఏజెన్సీలో అయినా రీఫిల్ చేసుకోవచ్చు. ఒక చోట కొని మరో చోట రీఫిల్ చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది.
ఛోటు సిలిండర్ కేవలం గ్యాస్ ఏజెన్సీల్లో మాత్రమే కాదు. కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంకులు, గుర్తింపు పొందిన అవుట్‌లెట్లలో కూడా సులభంగా దొరుకుతాయి. ఖాళీ సిలిండర్ ఇచ్చి వెంటనే నిండిన సిలిండర్ తీసుకోవచ్చు. డెలివరీ కోసం ఎదురుచూపులు పూర్తిగా తగ్గిపోతాయి.
ఈ సిలిండర్ ముఖ్యంగా కొత్తగా నగరానికి వచ్చిన వారు, బ్యాచిలర్లు, తక్కువ వంట చేసుకునే చిన్న కుటుంబాలకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ సిలిండర్ ఆలస్యమైనప్పుడు బ్యాకప్గా కూడా వాడుకోవచ్చు. వంట పనులు ఎక్కడా ఆగకుండా చూసుకోవడానికి ఇది ఉత్తమం.
భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు. అవసరమైన అన్ని ప్రమాణాలు పాటించి తయారు చేశారు. తక్కువ బరువు ఉండటం వల్ల మహిళలు, వృద్ధులు కూడా సులభంగా ఉపయోగించగలరు. సరైన వినియోగం తో ఇది పూర్తిగా సురక్షితం.