Indira Mahila Shakti Scheme RTC Buses Telangana: తెలంగాణలో మహిళల సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు మరింత ఊపందుకుంటున్నాయి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. దీంతో ప్రయాణికులకు సీట్లు దొరకక, రద్దీలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద కొత్త ఏర్పాటు చేస్తున్నారు.

మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs) తమ పొదుపు నిధులతో బస్సులు కొనుగోలు చేసి, ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్నాయి. ఇలా మొత్తం 600 బస్సులు అందుబాటులోకి తీసుకునే లక్ష్యంతో పని జరుగుతోంది. మొదటి దశలో 152 బస్సులు ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్నాయి. తాజాగా మరో 200 బస్సులు సిద్ధమై, త్వరలోనే సేవలు మొదలవుతాయి. మిగిలినవి కూడా వేగంగా అందుబాటులోకి వస్తాయి.
ఈ పథకం ద్వారా మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం వస్తోంది. ఒక్కో బస్సుకు నెలకు సుమారు రూ.70,000 వరకు అద్దె రావడంతో గ్రామీణ మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడుతోంది. ఇది కేవలం ఆర్టీసీ సమస్య పరిష్కారమే కాదు, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే వినూత్న అడుగు. ఇంతకుముందు ప్రైవేట్ వ్యక్తుల నుంచి బస్సులు అద్దెకు తీసుకునేది ఆర్టీసీ, ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా ఇది మారుతోంది.
ప్రయాణికులకు ఇక రద్దీ భయం లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ఈ చర్యలతో తెలంగాణ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం వైపు మరో అడుగు వేస్తోంది.